మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించడంపై సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీవీకి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఇది తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణమంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. అలాగే, చరణ్ సింగ్ , ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కూడా ఈ పురస్కారాన్ని ప్రకటించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వామినాథన్ రైతుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు.

పీవీ నరసింహారావు నిజమైన దార్శనికుడు, పండితుడు, బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడు. విప్లవ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి భారతదేశాన్ని ఆర్థికశక్తిగా మార్చడానికి పునాది వేసిన వ్యక్తి. ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించడం భారతీయులందరికీ, తెలుగువారికి మరింత సంతోషకరమైన విషయం. ఈ పురస్కారం చాలా ఆలస్యంగా దక్కింది. కానీ, ఇంతకుమించిన గౌరవం ఏముంటుందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.


