వెబ్ సిరీస్: 90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్
నటీనటులు: శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బలి
ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి
సినిమాటోగ్రఫీ: అజాజ్ మహ్మద్
నిర్మాత: రాజశేఖర్ మేడారం
రచన, దర్శకుడు: ఆదిత్య హాసన్
నటుడు శివాజీ, వాసుకి ప్రధాన పాత్రలో ఈ టీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న తాజా వెబ్ సిరీస్ 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన మౌళి, రోషన్ రాయ్ తదితరులు నటించారు.

కథ
మధ్య తరగతికి చెందిన చంద్రశేఖర్(శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టారు. తన పిల్లలను క్రమశిక్షణతో పెంచుతుంటారు. ఆయన భార్య రాణి (వాసుకీ ఆనంద్) మధ్యతరగతి ఆప్యాయతలు, ఆలోచనలతో జీవిస్తుంటారు. వీళ్ల పెద్ద కుమారుడు రఘుతేజ (మౌళి తనూజ్ ప్రశాంత్) పదో తరగతిలో స్టేట్ ఫస్ట్ వస్తాడనే నమ్మకంతో శివాజీ ఉంటాడు. ఇక అమ్మాయి దివ్య (వసంతిక) భవిష్యత్తు గురించి, చదువు బుర్రకెక్కని అర్జున్ (రోహన్) గురించి ఆలోచిస్తూ.. ఆర్థిక ఇబ్బందుల మధ్య కుటుంబాన్ని నడిపిస్తుంటారు. అయితే రఘుతేజ సుజిత (స్నేహల్)ను ప్రేమిస్తాడు. అలాగే క్రికెట్ కూడా తనకి ఇష్టం. తండ్రి ఆశించినట్టు రఘుతేజకు పదో తరగతిలో జిల్లా ఫస్ట్ ర్యాంకు వచ్చిందా? కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందిపడిన పరిస్థితులేంటి? ఉపాధ్యాయుడిగా చంద్రశేఖర్ సాధించే ఘనత ఏంటి? రఘు ప్రేమ సంగతి ఏమైంది? అనేది ఈ సిరీస్ స్టోరీ.
విశ్లేషణ
జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్లిన చిన్ననాటి సంగతులను మర్చిపోలేం. పాఠశాల నుంచి కాలేజీ వరకు గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఈకాలంలో అయితే స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి. కానీ ఒకప్పటి రోజుల్లో పలకరించుకోవాలంటే ల్యాండ్ఫోన్లు ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డులు తప్ప వేరే దారి లేదు. అయితే ఇలాంటి సన్నివేశాలను తెరపై అందంగా ఆవిష్కరించాడు. ఆరు ఎపిసోడ్స్ కలిగిన ఈ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులకు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఈ సిరీస్ ఎక్కువగా 90s వాళ్లకు బాగా కనెక్ట్ అవుతుంది.
శివాజీ చంద్రశేఖర్ పాత్రలో లెక్కల మాస్టార్‌గా ఎంతో ఒదిగిపోయాడు. శివాజీ మధ్యతరగతి తండ్రికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. గృహిణి రాణిగా వాసుకీ నటన కూడా అద్భుతంగా ఉంటుంది. రఘు పాత్రలో మౌళి నటన కూడా సహజంగా ఉంటుంది. ఆదిత్యగా నటించిన రోహన్ క్యారెక్టర్ నవ్వులు పంచుతుంది. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్ని బాగున్నాయి. అనుకున్న విధంగా.. అప్పటి కాలానికి తగ్గట్టుగా దర్శకుడు చూపించాడు. అయితే అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. కచ్చితంగా కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన సరీస్ ఇది. ఈటీవీ విన్ యాప్ లో అందుబాటులో ఉంది.
రేటింగ్: 3/5


